శేషం శ్రీనివాసా చార్య: గురువులకు విన్నపం!

విద్యాక్షేత్రంలో అక్షర సేద్యం చేస్తూ

విద్యార్థుల్లో జ్ఞాన బీజాలు నాటి

విద్యా లక్ష్యాలు వికసింప జేసే

నిత్య కృషీవలురు మీరు

విద్యార్థుల తల రాతను వ్రాసే బ్రహ్మగా

నడతను నేర్పే అమ్మగా

‘గురు’తర బాధ్యతను మోస్తున్న

నవ భారత నిర్మాతలు మీరు

మీకు సవినయ విన్నపం

వీలైతే ఇవి గమనించండి

తరగతి నాలుగు గోడల మధ్య

చెప్పే నైతిక పాఠాలకు

బయటి ప్రపంచంలో

కనబడే దృశ్యాలకు

వైవిధ్యత తెలియజేస్తూ

విద్యార్థిని తికమక పడకుండా,

వాటికి గురికాకుండా

మనో ధైర్యాన్ని విద్యార్థిలో వృద్ధి చేసి

సంస్కారంతో నడిచే దారి చూపండి

కుటుంబ విలువలను

మానవతా విలువలను

మనిషి చుట్టూ వున్న

పర్యావరణాన్ని,జీవావారణాన్ని

కాపాడే వ్యక్తిగా తీర్చిదిద్దండి.

గణిత సమస్య సాధనలో

‘దగ్గరిదారి’ మార్గాన్ని చెప్పుతూ

జీవితంలో ఎదురయ్యే సమస్యలకు

అడ్డ దార్లు తొక్కద్దని చెప్పండి

‘క్రమశిక్షణ ‘

ఎదిగే విద్యార్ధికి ఆయుధమని

తెలియ జేస్తూ

దాన్ని ఎలా సాధన చేయాలో

మీరు ఆచరిస్తూ వారిని ఆచరించమనండి

మస్తిష్కాల్లో నిక్షిప్తమైన

సృజనాత్మకతను వెలికి తీసి

భావి తరాలకు అందించే

నూతన పరిశోధనలకు

అంకురార్పణ చేయండి

విద్యార్థి లో నున్న

ప్రత్యేక శక్తులను పరికించి

భవిష్యత్ చిత్రపటాన్ని ఊహించి

వాటి కనుగుణంగా తర్ఫీదు నివ్వండి

‘శ్రవణం’లోని శక్తిని

‘భాషణం’లోని మాధూర్యాన్ని

‘పఠనం’ లోని గొప్పదనాన్ని

‘లేఖనం’ లోని నైపుణ్యాన్ని

విద్యార్థికి అందిస్తూ తీర్చిదిద్దండి

చుట్టు ముట్టిన వింత వితండ వాదాల

సుడి గుండాల్లో పడకుండా,

‘మానవతా వాద’ నావలో ఎక్కించి

చుక్కాణిలా మార్గదర్శనం చేస్తూ

వారిని దరి చేర్చండి

కండ బలాన్ని, మనోవికాసాన్ని

పెంపొదిస్తూ

ఆత్మశక్తిని,సమష్టి తత్వాన్ని

వారిలో పాదు వేయండి

లక్ష్యాలను సాధించుటకు

అవకాశాలకై అర్రులు చాచక

సమయం విలువను తెలియ జేస్తూ

సాధించే సంకల్ప బలాన్ని

వారిలో పెంపొదించండి

సాటి మనిషిలోని

బలహీనతలు లెక్కించక,

ఆ వ్యక్తిలోని బలాలనుండి

స్ఫూర్తి పొందే మనోబలాన్ని పెంచండి

మానవత్వ పరిమళాలను

ఆస్వాదించే తత్వాన్ని,

ఇతరులకు సహాయ పడే గుణాన్ని పెంచి

విద్యార్థిలో సమగ్ర వ్యక్తిత్వ

శీల నిర్మాణం చేయండి

నూతన సాంకేతిక విజ్ఞానానికి

సరిపడు సమాచారాన్ని మీరు సేకరిస్తూ

సమకాలీన విషయాలపై పట్టు సాధించుటకు

మొదట మీరు ‘నవీకరణ’పొంది

వారికి శిక్షణ నివ్వండి

సమాజానికి ఉపయోగపడే

ఉపకరణాల్లా

జాతికి మానవ వనరులుగా

దేశభక్తితో నడిచే పౌరులుగా

విద్యార్థుల తీర్చిదిద్దే

ఉపాధ్యాయులు మీరు

మీకు వందనం

పైవన్నీ మీరు నిర్వర్తిస్తున్నా……

ఈ ఒక్కటి గమనించండి

విద్యార్ధి విలువైన బాల్యాన్ని ఆస్వాదించే వీలుకల్పిస్తూ,

మానసిక అలసట దూరం చేసుకునే

వారికి నచ్చిన విధంగా వుండే,

కొంత సమయాన్ని, స్వేచ్ఛను ఇవ్వండి

దారితప్పకుండా జాగ్రత్త పడండి…

ధన్యవాదములు

 

-శేషం శ్రీనివాసా చార్య
Rtd GHM, సెల్ నం: 94406 59257
(రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార గ్రహీత 2011)

Alsor Read: Telugu Basha Dinotsavam: తెలుగు వెలుగు

Leave A Reply

Your email address will not be published.