హుజూరాబాద్ ఉప ఎన్నిక.. అమల్లోకి ఎన్నికల కోడ్
హైదరాబాద్ (CLiC2NEWS): హుజూరాబాద్ లొ జరుగనున్న ఉప ఎన్నికల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి అక్కడ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ వెల్లడించారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఏర్పాట్లపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొవిడ్ నిబంధనల మేరకు నామినేషన్లు దాఖలు చేసే సమయంలో ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం మూడు వాహనాలకు మాత్రమే అనుమతి ఉంటుందని పేర్కొన్నారు.
కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. పోలింగ్‌కు 72 గంటల ముందే ప్రచారం ముగించాలని చెప్పారు. ఎన్నికల నియామవళికి సంబంధించి సంబంధిత కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. కొవిడ్ నిబంధనలను అధికారులు కఠినంగా అమలు చేయాలని శశాంక్ గోయల్ ఆదేశించారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో 305 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 47 పోలింగ్ కేంద్రాల్లో వెయ్యి కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారు. వయోవృద్ధులకు, దివ్యాంగులకు, కొవిడ్ రోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పిస్తామన్నారు.
హుజూరాబాద్ నియోజకవర్గంలో 2,36,430 మంది ఓటర్లు ఉన్నారని, ఇందులో పురుష ఓటర్లు 1,17,552, మహిళ ఓటర్లు 1,18,716 మంది ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 14 మంది ఉండగా, సర్వీస్ ఓటర్లు 147, ట్రాన్స్ జెండర్ ఒకరు ఉన్నారు.