ఫాదర్స్ డే సందర్భంగా….

`మాతృదేవో భవ… పితృదేవో భవ` అని భారతీయ సంస్కృతి వేల ఏళ్ల క్రితమే తల్లిదండ్రులను దైవస్వరూపులుగా భావించింది. అందులో తండ్రి అంటే కేవలం ఒక వ్యక్తి కాదు.. కుటుంబానికి వెన్నెముక, పిల్లల భవిష్యత్తుకు శిల్పి, జీవిత ప్రయాణానికి దిక్సూచి. రాముడికి దశరథుడు ఎలా ధర్మమార్గాన్ని చూపాడో, నేటి ఆధునిక సమాజంలోనూ ప్రతి తండ్రి తన పిల్లల విజయాలకు నిశ్శబ్ద పునాది అవుతూనే ఉన్నాడు.

కాలం మారింది…
జీవన విధానాలు మారాయి…
కానీ తండ్రి ప్రేమ మాత్రం మారలేదు. ఒకప్పుడు పొలంలో చెమటోడ్చి కుటుంబాన్ని పోషించిన తండ్రి, నేడు కార్యాలయాల్లో, కర్మాగారాల్లో, వ్యాపారాల్లో శ్రమిస్తూ అదే బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. పిల్లల చేతిలో స్మార్ట్‌ఫోన్ కనిపించినా, వారి వెనుక తండ్రి కష్టార్జితమే కనిపిస్తుంది. పిల్లల భవిష్యత్తు కోసం తన వర్తమానాన్ని త్యాగం చేసే మహోన్నత హృదయం తండ్రిది.

తల్లి ప్రేమ నదిలా కనిపిస్తే, తండ్రి ప్రేమ సముద్రంలా లోతుగా ఉంటుంది. తల్లి కన్నీళ్లు బయటపడతాయి… తండ్రి కన్నీళ్లు గుండెల్లోనే దాగిపోతాయి. పిల్లల విజయాన్ని చూసి గర్వంతో మురిసిపోయే తొలి వ్యక్తి తండ్రే. వారి ఓటమిలో ధైర్యం నింపే తొలి గురువు కూడా తండ్రే.

అందుకే ఫాదర్స్ డే అనేది కేవలం ఒక వేడుక కాదు… మన జీవితాన్ని తీర్చిదిద్దిన ఆ మహావృక్షానికి కృతజ్ఞతలు చెప్పే సందర్భం. తన నీడలో కుటుంబాన్ని కాపాడుతూ, తన కోరికలను త్యాగం చేసి పిల్లల కలలకు రెక్కలు తొడిగిన ప్రతి తండ్రికి శిరసావహనం. తండ్రి అనే పదం చిన్నదే కావచ్చు… కానీ దాని వెనుక దాగి ఉన్న ప్రేమ, త్యాగం, బాధ్యత, అనురాగం ఆకాశం కంటే విశాలమైనవి. అటువంటి ప్రతి తండ్రికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు.

-ఎస్.వి.రమణా చార్య
సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు
సెల్ష +91 98498 87086

Also Read: డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఓ వ్య‌క్తికి ఏడు రోజుల జైలు..

Leave A Reply

Your email address will not be published.