ఆరు జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: సిఎం కెసిఆర్
హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన కేబినేట్ సమావేశం జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్ టీకాల పురోగతి, మందుల లభ్యత, ఆక్సిజన్ పడకల సామర్థ్యం, తదితర అంశాలపై ప్రధానంగా చర్చించారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాప్తి నేపథ్యంలో కార్యాచరణ, సన్నద్ధతపై వైద్యారోగ్యశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. ఒమిక్రన్ గురించి, వివిధ దేశాల్లోని పరిస్థితిపై వైద్య అధికారులు మంత్రి వర్గానికి వివరించారు. గత రెండేళ్లుగా కరోనా కట్టడికి జరిగిన పురోగతిపై మంత్రివర్గం చర్చించింది. వైద్యశాఖ పూర్తి సన్నద్ధతతో ఉన్నదని, అన్ని రకాల మందులు, పరికరాలు, మానవ వనరులు, పూర్తిగా అందుబాటులో ఉన్నాయని, తామంతా సంసిద్ధంగా ఉన్నామని వైద్యారోగ్యశాఖ అధికారులు కేబినెట్‌కు వివరించారు.
రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులందరూ వారి జిల్లాల్లో పర్యటించి తాజా పరిస్థితులపై సమీక్షించాలి. అవసరమైన వారందరికీ సత్వరమే టీకా ఇప్పించాలని సిఎం ఆదేశించారు. అదిలాబాద్, కుమరంభీం, నిర్మల్, మహబూబ్ నగర్, నారాయణ పేట, జోగులాంబ గద్వాల్ ఆరు జిల్లాలపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక దృష్టి పెట్టాలి అని ఆరోగ్య శాఖ కార్యదర్శులను, మంత్రులను సిఎం కెసిఆర్ ఆదేశించారు.